తెలుగు ఖతులకు (ఫాంట్లకు) సంబంధించినంత వరకూ గత ఏడాదికీ ఇప్పటికీ పరిస్థితి చాలా మెరుగయ్యింది. ఇప్పుడు అనేక అందమైన నాణ్యమైన తెలుగు ఖతులు ఉచితంగానే లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ సిలికానాంధ్ర సంస్థ కలసి మొత్తం 18 తెలుగు ఖతులను తెలుగు విజయం ప్రాజెక్టు ద్వారా అందించాయి. అలానే, సురవర వారు స్వర్ణ మరియు సంహిత అనే మరో రెండు ఖతులను ఉచితంగా అందిస్తున్నారు. వీటిని దింపుకొని మన కంప్యూటర్లలో స్థాపించుకుని మనం ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా, వీటిని మన జాల గూళ్ళ లోనూ ఉపయోగించుకోవచ్చు! మన జాల గూళ్ళను చూసే వారి కంప్యూటర్లలో ఈ ఖతులు లేకపోతే ఎలా అనుకుంటున్నారా? ఫర్లేదు. @font-face అనే CSS3 సౌలభ్యం ద్వారా వాడుకరుల కంప్యూటర్లలో ఈ ఖతులు లేకున్నా సర్వర్ నుండి అప్పటికప్పుడు తెచ్చి చూపించవచ్చు. అదెలాగో ఈ టపా వివరిస్తుంది.
ముందుగా, క్రింద చూపించిన తెరపట్టు యొక్క అసలు పేజీని చూడండి. మీ కంప్యూటర్లో కొత్త తెలుగు ఖతులు లేకున్నా మీకు ఆ పేజీ తెరపట్టులో చూపిన విధంగా కనబడుతుంది. గమనిక: ఈ జాల ఖతుల సౌలభ్యం కనీసం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (IE) 9 లేదా ఫైర్‌ఫాక్స్, క్రోమ్, ఓపెరా, సఫారీ వంటి విహారిణులలో పనిచేస్తుంది.
ఈ జాల ఖతుల సౌలభ్యాన్ని మన జాల
పుటలలో వినియోగించుకోడానికి, మనకు కావాలసిన ఖతులను ముందుగా మన సర్వర్ లోనికి ఎక్కించాలి.
ఆ తర్వాత CSS ఫైలులో (లేదా HTML ఫైలులో నేరుగా CSS ద్వారా), @font-face అన్న నియమం
ద్వారా ఖతిని నిర్వచించాలి. ఆపై, కావలసిన అంశాలకు ఆ ఖతిని వర్తింపజేయవచ్చు.
ఖతిని నిర్వచించడం
@font-face {
src: url(NTR.ttf);
font-family: 'NTR';
}
@font-face అన్న నియమంలో src లక్షణానికి విలువగా మనం నర్వరులోనికి ఎక్కించిన ఖతి
యొక్క చిరునామాని url() రూపంలో ఇవ్వాలి. మనం ఎక్కించిన ఖతి CSS ఫైలు ఉన్న సంచయం
(ఫోల్డరు) లోనే ఉంటే, కేవలం ఖతి యొక్క ఫైలు పేరు ఇస్తే సరిపోతుంది. లేదా పూర్తి
URL కూడా ఇవ్వవచ్చు. వేరే సర్వర్లలో (డొమైన్లలో) ఉన్న ఖతులను మనం ఉపయోగించుకోడానికి
మామూలుగా అయితే వీలుండదు. ఆయా సర్వర్లలో ఖతులను ఎవరైనా ఉపయోగించుకునే విధంగా Access-Control-Allow-Origin
అనే HTTP headerను పేర్కొనాల్సి ఉంటుంది. గూగుల్ జాల ఖతుల వంటి ప్రజా సేవా గూళ్ళు
వారి ఖతులను అందరూ వాడుకొనేలా ఇలా పేర్కొంటాయి. ఇలాంటి సౌలభ్యాన్ని తెలుగు విజయం
వారు లేదా మరేదైనా సంస్థ అందించే వరకూ మనం ఉపయోగించుకోవాలనుకున్న ఖతులను మన సర్వర్లలోనికి
ఎక్కించుకోవడమే మార్గం.
ఇక font-family అన్న లక్షణపు విలువ మనం ఆ ఖతిని ఏ పేరుతో ఉపయోగిస్తామో తెలియజేస్తుంది. ఒక వేళ అదే ఖతి కుటుంబంలో బొద్దు మరియు వాలు ఖతులను కూడా నిర్వచిస్తే, అన్నిటికీ ఒకే font-familyని ఇవ్వాలి.
ఇలా నిర్వచించిన ఖతిని వాడుకరి యొక్క జాల విహారిణి మొదటిసారి సందర్శనలో దించుకుని అట్టేపెట్టుకుంటుంది. మిగతా పేజీలకు లేదా తదుపరి సందర్శన లోనూ మళ్ళీ ఖతిని దించుకోదు.
అయితే, మనం జాల ఖతిగా ఉపయోగించిన ఖతి వాడుకరి కంప్యూటర్లో ఉంటే (మనం సర్వరు నుండి దింపుకోకుండా) దాన్నే ఉపయోగించవచ్చు. అందుకు src లక్షణానికి local() విలువనూ ఇవ్వవచ్చు. ఈ క్రింది ఉదాహరణను పరిశీలించండి (కొత్త చేర్పులను బొద్దుగా చేసాను):
@font-face {
src: local('NTR'), url(NTR.ttf);
font-family: 'NTR';
}
ఈ local() అన్నదాని వల్ల వాడుకరి కంప్యూటర్లో ఖతి ఉంటే సర్వరు నుండి అదనపు దింపుకోలుని నివారించవచ్చు.
నిర్వచిత ఖతిని వాడుకోవడం
ఈ నిర్వచిత ఖతులను font లేదా font-family అన్న CSS నియమాలలో మామూలుగా ఖతులను వాడేసినట్టు వాడుకోవచ్చు. ఉదాహరణకు,
body {
font: 16px 'NTR', sans-serif;
}
పై నియమం వల్ల, పేజీ లోని పాఠ్యం అంతా ఎన్ టీ ఆర్ ’ ఖతిలో కనిపిస్తుంది.అంతే!
మరింత స్పష్టత కోసం లేదా ఈ కోడుని నిజజీవితంలో ఉండే తతిమా కోడు సమక్షంలో చూడడానికి, నేను తయారు చేసిన నమూనా పేజీ యొక్క కోడుని చూడండి.
ఈ ప్రేరణతో అందరూ తమ సైట్లనూ బ్లాగులనూ అందమైన ఖతులతో అలంకరిస్తారని ఆశిస్తూ…
ఆనంద జాలాయనం!
Back to SiliconAndhra Fonts Page